కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2021, మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌కు తెలిపారు. ఈ మేరకు జితేంద్ర సింగ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్ర విభాగాల్లో మొత్తం మంజూరు పోస్టులు సంఖ్య 40.35 లక్షలు కాగా, వాటిలో 9.79 లక్షలు ఖాళీగా ఉన్నాయంటే.. నాలుగింట ఒక పోస్టు భర్తీకి నోచుకోలేదు. పోస్టుల కల్పన, భర్తీ ప్రక్రియ అనేది సంబంధిత మంత్రిత్వ శాఖ బాధ్యత అని, ఇది నిరంతర ప్రక్రియని మంత్రి చెప్పారు.