తెలంగాణలోని సిద్దిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో ఫుట్ పాత్ నిర్మాణం,14వ వార్డు ముస్తాబాద్ సర్కిల్ నుంచి ఛత్రపతి శివాజీ సర్కిల్ వరకూ రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న వరద కాలువ, డ్రైనేజీ, ఫుట్ పాత్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటింటా నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్తలో పొడి చెత్త రీ సైక్లింగ్ చేస్తున్నామని తెలిపారు. నిత్యం 10 నుంచి 15 టన్నుల తడి చెత్త ద్వారా బయోగ్యాస్ తయారు చేస్తున్నట్లు, 15 నుంచి 20 టన్నుల తడి వ్యర్థాలతో సేంద్రియ జీవ ఎరువు తయారు చేస్తున్నట్లు మంత్రి వివరాలను వెల్లడించారు.
ఇప్పటి వరకూ 2,522 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 756 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ సీఎన్జీ గ్యాస్ తయారైందని, అలాగే 579 టన్నుల తడిచెత్తతో సేంద్రియ జీవ ఎరువు తయారైందని మంత్రి చెప్పారు. దీంతో బుస్సాపూర్ డంప్ యార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తకుప్పలు తొలగిపోయాయన్నారు.