టీడీపీ ఎంపీ కేశినేని నాని.. అతడి సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు.. ఎంపీ కారుకు వాడే నకిలీ స్టిక్కర్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమయ్యాయి.
నకిలీ స్టిక్కర్‌తో ‘టీఎస్07హెచ్ డబ్ల్యూ7777’ నంబరు గల కారు విజయవాడ, హైదరాబాద్‌లో తిరుగుతోందంటూ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కారు నాని సోదరుడు చిన్ని భార్య జానకిలక్ష్మి పేరుపై ఉంది. దాన్ని చిన్ని వినియోగిస్తున్నారు. ఆ కారుపైనే కేశినేని నాని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేశినేని చిన్ని ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి దానిపై వివరణ ఇచ్చారు.
ఆ స్టిక్కర్ ఎవరిదో విచారణలో తేలనివ్వాలన్నారు. ఈ చిల్లర వివాదంలోకి తన కుటుంబాన్ని లాగడం బాధాకరమని చెప్పారు. తనపై రాజకీయంగా విమర్శలు ఉంటే చేయాలని.. కానీ ఇంట్లో ఆడవాళ్లను దీనిలోకి లాగడం సరికాదని చెప్పారు. పార్టీకి దీనితో సంబంధం లేదని.. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి తాను సిద్ధంగా ఉంటానన్నారు.