పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని.. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయడం లేదు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. పువ్వాడ అజయ్ వ్యాఖ్యలను బొత్స దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా ఆయన స్పందించారు. మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. సాంకేతికంగా ఇబ్బందులుంటే దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై ఆలోచించాలి తప్ప రెచ్చగొట్టేలా ఉండకూడదని హితవు పలికారు.
తెలంగాణ విడిపోవడం ద్వారా హైదరాబాద్ నుంచి రావాల్సిన ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని.. అలా అని ఏపీలో హైదరాబాద్‌ను కలిపేయాలని అడగగలమా అని బొత్స ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల సంగతిని ఆయన చూసుకోవాలని.. తమ రాష్ట్రం పరిధిలోని ముంపు గ్రామాల సంగతి తాము చూసుకుంటామన్నారు. విలీన మండలాలను తెలంగాణలో కలపాలని వాళ్లు కోరితే గతంలా ఉమ్మడి రాష్ట్రాన్నే కొనసాగించాలని తామూ డిమాండ్ చేస్తామని బొత్స వ్యాఖ్యానించారు.