తెలంగాణ రాష్ట్రమేర్పడిన దాదాపు 8ఏండ్ల తర్వాత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరిచింది. అందులో భాగంగా రేపటి జరగనున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన గిరిజన వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
రేపటి పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను కేంద్రంలోని మోదీ సర్కారు ప్రవేశపెట్టనుంది. అయితే తెలంగాణలో కేంద్ర గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర యూనివర్సిటీల సవరణ బిల్లు-2022ను తీసుకురానున్నట్లు రాజ్యసభ బులెటిన్‌లో వెల్లడించారు.
ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో గిరిజన యూనివర్సిటీ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. ములుగు జిల్లా జకారం గ్రామంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిన సంగతి కూడా తెల్సిందే.