ఆంధ్రా తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడిన శివకుమార్ అనే యువ ఆటగాడు అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలి ఇంటర్నేషనల్‌మ్యాచ్‌ను అతడు ఆడాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన శివకుమార్.. కొంతకాలం క్రితం అమెరికాలో స్థిరపడ్డాడు.
ఏదైనా దేశం తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే కనీసం మూడేళ్లు ఆ దేశంలో నివసించాలన్నది ఐసీసీ నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవలే మూడేళ్ల నిబంధనలను పూర్తిచేసుకున్న శివ.. అమెరికా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.
పేస్ బౌలర్ కమ్ ఆల్‌రౌండర్ అయిన శివ.. ఆంధ్రా తరఫున 42 రంజీ మ్యాచ్‌లు ఆడి 1061 పరుగులు చేసి 133 వికెట్లు తీశాడు. 40 వన్డేలు, 16 టీ20లు కూడా ఆడాడు. 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులోనూ శివ సభ్యుడే. కానీ మ్యాచ్‌లు ఆడే తుది జట్టులో అతడికి అవకాశం రాలేదు. ఆ తర్వాత అమెరికా వెళ్లిన శివ అక్కడ తన ప్రతిభను నిరూపించుకుని జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.