టీఆర్‌ఎస్‌లో కొన్ని చోట్ల గొడవలు ఉండడం టీఆర్‌ఎస్ బలంగా ఉందనడానికి నిదర్శనం అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. బలంగా ఉన్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు.
రాష్ట్రమంతా టీఆర్‌ఎస్ ఒక్కటే ఉందని ఈ విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ సర్వేలే స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దొర అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని.. అలా అయితే ఎంతమందిని ఆయన జైల్లో వేశారని ప్రశ్నించారు. షెడ్యూల్ ప్రకారం 2023లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని.. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ చచ్చిపోయిందని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ సిరిసిల్లకు వస్తే అక్కడే రెండు రోజులు ఉండి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, పథకాలు చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఎంపీగా ఓడిన రాహుల్ గాంధీ.. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓటమిపాలైన వంత్ రెడ్డి సిరిసిల్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.