భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఈరోజు మధ్యాహ్నానికి నీటిమట్టం 60.30 అడుగులకు చేరింది. దీంతో సమీపంలోని లోతట్టు కాలనీలకు వరదనీరు భారీగా చేరడంతో అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.గోదావరికి వరద నీటి ప్రభావం అధికంగా ఉండడంతో భద్రాచలం నుంచి చర్ల, కూనవరం వెళ్లే మార్గాల్లో రావాణా నిలిచిపోయింది. నేటి సాయంత్రం నుంచి గోదావరి బ్రిడ్జ్‌పై రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. దీంతో హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోనున్నాయి.
గోదావరి నీటి మట్టం 70 అడుగుల వరకు చేరుతుందనే అంచనాతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం, మణుగూరు, చర్ల, అశ్వాపురం, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్, కరకగూడెం తదితర మండలాల్లోని సుమారు ఐదు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలోనే ఉంటూ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.