తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో గోదావరి ఉద్ధృతి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.
మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వస్తున్న వరదను అంచనా వేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా మరో నెలరోజులకు సరిపడా బొగ్గు నిల్వలను సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. వరద వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో రక్షణ చర్యలకు నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖకు కేసీఆర్ సూచించారు.