తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యామ్‌కు వరద ముంచెత్తుతోంది. మంగళవారం టీబీ డ్యామ్‌కు 87,305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 1,649 క్యూసెక్కులు నమోదైంది.
ప్రస్తుతం డ్యామ్‌లో 95.314 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1630.33 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యామ్ సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలకు వరద భారీగా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
గేట్లు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తుంగభద్ర నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని తుంగభద్ర బోర్డు అధికారులు కర్నాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.