వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ మేరకు విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చిన ఆమెకు సీఎం జగన్, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇస్తున్నందుకు సీఎం జగన్ సహా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును సీఎం జగన్ సన్మానించారు. అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సీఎం జగన్ ఆమెకు పరిచయం చేశారు. అంతకుముందు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ద్రౌపది ముర్ముకు సీఎం జగన్ దంపతులు ఘనస్వాగతం పలికారు.
