రూపాయి విలువ పతనమైందంటూ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ గొంతుచించుకుని చెప్పారని.. ఇప్పుడు దాని విలువ ఎందుకు పడిపోయిందో చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గతంలో ఆయన చెప్పిన విషయాన్నే ఇప్పుడు తాము అడుతున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ అసమర్థ విధానాల వల్లే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.80కి పడిపోయిందని విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా మోడీ, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశాన్ని బీజేపీ పట్టిపీడిస్తోందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీ ఏం మాట్లాడారో భగవంతునికే ఎరుకని చెప్పారు. టీఆర్‌ఎస్ అడిగిన ఒక్క ప్రశ్నకూ బీజేపీ నేతలు సమాధానం చెప్పలేదన్నారు.
దేశానికి మోదీ చేసిన మంచి ఒక్కటైనా ఉందా? అని కేసీఆర్ నిలదీశారు. తెలంగాణలో జరిగే అభివృద్ధిలో కనీసం 10శాతమైనా భాజపా పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందా? అని ప్రశ్నించారు. అసమర్థ విధానాల వల్ల దేశాన్ని ఆగం పట్టించారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని మోడీ చెప్పారని.. ఈ విషయంలో ఆయనకు థాంక్స్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కార్ ఇంజిన్ సూపర్ స్పీడ్‌గా ఉందని.. కేంద్రంలోనూ ఇలాంటి ప్రభుత్వమే రావాలన్నారు.