కాంగ్రెస్ పార్టీ నేత.. ఆ పార్టీ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ మళ్లీ తెలంగాణలో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా వచ్చే సెప్టెంబర్ లో మరోసారి రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్ల కు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు.
అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు పుంజుకుంటున్నాయి. ఇక ముందు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి చేరేందుకు పలువురు ముఖ్య నేతలు సముఖత వ్యక్తం చేస్తున్నారు.
భారీ జాబితాకు నాయకత్వం రూపు కల్పన చేసింది. జాబితాలో వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. విడతల వారీగా చేరికలు ఉండేలా నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణకు రాహుల్ రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని సమాచారం.