అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ్లిన మంత్రి కి అదే వేదిక మీద, వేలాది మంది ఎన్ ఆర్ ఐ లు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, గాదరి కిషోర్, ఆటా ప్రతినిధులు తదితరుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
అంతా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఆటా మహా సభల సమయంలోనే తన పుట్టిన రోజు రావడం, ఇంత మంది తెలంగాణ, తెలుగు బిడ్డల నడుమ వేడుక జరపడం అత్యంత ఆనందాన్ని కలిగించిందన్నారు. ఆటా ప్రతినిధులు, ఎన్ ఆర్ ఐ మిత్రులు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.