ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క ఎనిమిదేండ్ల పాలనలో అంతా తిరోగమనమే అని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈరోజు తెలంగాణ పర్యటనకు విచ్చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా జలవిహార్‌లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని పేర్కొన్నారు. మోదీ..ప్రధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపారని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మోదీ మౌనమెందుకు వహిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే ప్రధాని మోదీని దోషిగానే చూడాల్సి వస్తుందన్నారు.
