రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ మహనగరంలోని జలవిహార్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. మరో రెండు రోజులు పాటు ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటైనా పూర్తి చేశారా?.. చేస్తే ఏం చేశారో చెప్పండి?… నేను కాదు ప్రజలు అడుగుతున్నారు.
దేశంలో రైతుల భాగస్వామ్యం చాలా పెద్దది. వారి ఆదాయం డబుల్ చేస్తాం అన్నారు…చేయలేదు. కానీ ఖర్చు మాత్రం డబల్ అయింది. ఢిల్లీ ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు మేము సహాయం చేస్తే కూడా అవహేళన చేస్తున్నారు దేశ రైతులు బంగారం అడగడం లేదు, మద్దతు ధర అడుగుతున్నారు. ముందు ముందు ఇక మీ ఆటలు సాగవు. మోదీ కంటే ముందు చాలా మంది ప్రధానులు పనిచేశారు. ఎవరు శాశ్వతం కాదు’’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.