దీర్ఘకాలిక వ్యాధి సోకిన కుమారుడిని కాపాడుకొనేందుకు ఓ తల్లి సామాజిక మాధ్యమాల ద్వారా సాయం కోరింది. దాన్ని అవకాశంగా తీసుకొని గుర్తు తెలియని వ్యక్తి సోనూసూద్ పేరుతో ఆమెను మభ్యపెట్టి ఎకౌంట్ ఖాళీ చేసిన ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సీటీఆర్‌ఐ భాస్కరనగర్ ప్రాంతానికి చెందిన డి.సత్యశ్రీకి 6 నెలల కొడుకు ఉన్నాడు. ఆ బాబుకు దీర్ఘకాలిక వ్యాధి సోకడంతో వైద్యానికి లక్షలు ఖర్చు చేసే స్థితిలో లేని ఆ తల్లి సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని బంధువులు, స్నేహితులకు తెలియజేసింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి జూన్ 27న సత్యశ్రీకి ఫోన్ చేసి సోనూసూద్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని వైద్యానికి డబ్బు ఇస్తామని చెప్పాడు. దీంతో ఆమె బ్యాంక్ ఎకౌంట్ వివరాలు చెప్తుండగా ఆవేమీ వద్దని, ఫోన్‌లో ఎనీ డెస్క్ యాప్ ఇన్‌స్టాల్ చేసి డిటైల్స్ యాడ్ చేయమని చెప్పాడు. దీంతో సత్యశ్రీ యాప్‌లో వివరాలు నమోదు చేయగా ఎకౌంట్ డబ్బులు పడలేదు సరికదా ఆమె ఖాతాలో ఉన్న రూ.95 వేలు మాయమయ్యాయి. ఈ విషయం గుర్తించిన ఆమె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.