తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” వరించింది. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని, వసంత్ నగర్ డా. బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో “వృక్షమాత పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క” చేతుల మీదుగా “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” ను జోగినిపల్లి సంతోష్ కుమార్ అందుకున్నారు.“సాలుమారద తిమ్మక్క ఇంటర్ నేషనల్ ఫౌండేషన్” మరియు “శ్రీ సిద్ధార్ధ ఎడ్యుకేషనల్ సొసైటి”, కర్ణాటక వారు సంయుక్తంగా 2020 సంవత్సరానికి గాను దేశంలో అత్యుత్తమ సామాజిక సేవకులకు అందిస్తున్న ఈ అవార్డుల్లో ప్రకృతి పరిరక్షణ విభాగంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ అవార్డును అందుకున్నారు.
అనంతరం ఆయన వేదికపై మాట్లాడుతూ.. దేశంలో అత్యుత్తమ ప్రకృతి సేవకురాలు, ఆధ్యాత్మిక గరువు ఆధ్వర్యంలో ని కమిటీ నన్ను ఇంతటి అద్భుతమైన “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” అవార్డుకు ఎంపిక చేయడం నా పూర్వజన్మ సకృతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నడిచిన బాటలో అడుగులో అడుగేస్తూ.. నా వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో సరిగ్గా ఐదేళ్ల క్రితం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఒకరు మరొక మిత్రున్నో, కుటుంబ సభ్యున్నో చెట్లు నాటేలా ప్రోత్సహించాలనే చిన్న ప్రయత్నంతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఇవ్వాల ఖండాలు దాటడం నా ఘనతగా నేను భావించడం లేదు. అయ్యో ఈ నేల భవిష్యత్ తరాలతకు అందకుండా పోతుందేమోనని స్పందించే ప్రతీ హృదయానికి, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో మొక్కలు నాటిన ప్రతీఒక్కరికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకుపోయేందుకు కావల్సిన శక్తిని అందించిందని అన్నారు. ఈ వర్షాకాలం సీజన్ లో ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు.. తనతోపాటు అవార్డును అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ పద్మశ్రీ ఎ.ఎస్ కిరణ్ కుమార్ గారికి, ప్రముఖ నిర్మాత శ్రీ రంగనాథ్ భరద్వాజ్ గారికి, ప్రముఖ విద్యావేత్త, రచయిత గురురాజా కరజ్జయిని గారికి, శ్రీమతి సత్యామోర్గాని గారికి శుభాకాంక్షలు తెలిపారు.వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి గంగాధరయ్య పరమేశ్వరతో పాటు సిద్ధార్థమఠం పీఠాధిపతి హొరనహళ్లి శ్రీశ్రీ సద్గురు శంకరానంద మహాస్వామి, ఇతర పీఠాధిపతులు, సాలుమారద తిమ్మక్క ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.