విద్య, వైద్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, సచివాలయ భవనాలు నిర్మించామని.. నాడు-నేడుతో భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ అభివృద్ధి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో పెద్దిరెడ్డి మాట్లాడారు.
ఎన్నికల్లో 95 శాతం హామీలు అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికీ ఆయన అండగా ఉన్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా జగన్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. మరోవైపు కుప్పంలో తమిళ నటుడు విశాల్ వైసీపీ తరఫున పోటీ చేస్తాడంటూ ఎల్లో మీడియా వార్తలు రాస్తోందని.. అదంతా అవాస్తమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. కుప్పం అభ్యర్థి భరత్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.