వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని.. అంతే తప్ప మామ, అల్లుళ్లు కాదని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కొడుకు కృష్ణమూర్తి నిలబడినా ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని ఇల్లరికం అల్లుడిని కాదనంటూ పరోక్షంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఉద్దేశించి కొడాలి నాని అన్నారు.
‘‘వారసత్వమంటే వైఎస్సార్.. జగన్. సీనియర్ ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్. మామ పేరు చెప్పుకొనే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకు? రాష్ట్రంలో చంద్రబాబు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఇల్లరికం అల్లుళ్లే. వారిని ఇంటికి పంపించండి. చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకుని తినొచ్చు అనే ఆలోచనలో దుష్ట చతుష్టయం ఉంది. చంద్రబాబును సీఎం చేయడానికే పార్టీ పెట్టిన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్’’ అని కొడాలి నాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మతిస్థిమితం సరిగా లేదని విమర్శించారు. నారా లోకేశ్‌కి సరైన పేరు సిద్దప్ప అని కొడాలి నాని ఎద్దేవా చేశారు.