కేసీఆర్ సీఎం అయ్యాక రైతులకు గౌరవం దక్కడంతో పాటు భూముల ధరలు పెరిగాయని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. అభివృద్ధి కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. రూ.37కోట్ల వ్యయంతో దీన్ని చేపట్టామన్నారు. మోదీ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. సమాజంలో జవాన్లకు ఉన్న గౌరవాన్ని తగ్గించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తోందని హరీష్‌రావు విమర్శించారు. అగ్నిపథ్ పేరుతో యువతను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. మోదీ పాలనలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ఆర్మీలోనూ కాంట్రాక్ట్ పద్ధతిని తెచ్చారని హరీష్ విమర్శించారు.