తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ధ హామీలను అమలు చేయడం లేదని టీఆర్‌ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా విక్రయిస్తోందని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ రాశారు.
రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆస్తులను విక్రయించవద్దని కోరారు. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, హెచ్‌ఎంటీ, సీసీఐ తదితర సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కేంద్రం అమ్ముతోందన్నారు.
గతంలో ఆయా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 7,200 ఎకరాల భూమిని కేటాయించిందని.. ప్రభుత్వ ధరల ప్రకారమే వాటి విలువ ఇప్పుడు రూ.5వేల కోట్లు ఉంటుందన్నారు. ఓపెన్‌మార్కెట్‌లో సుమారు రూ.40వేల కోట్లకు పైమాటేనని చెప్పారు. ఆ భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలని.. లేనిపక్షంలో వాటిని తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కేటీఆర్ కోరారు.