బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలను చూస్తే మంత్రిగా, తల్లిగా బాధేస్తోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని చెప్పారు. గత రెండేళ్లుగా కొవిడ్ పరిస్థితుల కారణంగా క్లాస్‌లు ప్రత్యక్షంగా జరగకపోవడం, ఇతర చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడంలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను క్యాంపస్ నియామకాల ద్వారా ఎంపిక చేసుకుంటున్నాయని.. అలాంటి అత్యున్నత సంస్థ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూడాలని కోరారు.
సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్‌ని నియమించామని మంత్రి చెప్పారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ వెంకటరమణను ప్రభుత్వం పంపిందని.. వారితో విద్యార్థులు చర్చించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఇది మీ ప్రభుత్వమని.. దయచేసి ఆందోళలను విరమించి చర్చించాలని సూచించారు.