తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న రేవంత్‌రెడ్డి పోలీసులను దాటుకుని క్యాంపస్‌లోనికి వెళ్లేందుకు యత్నించారు.
పోలీసులు అడ్డుకోవడంతో ఆ తర్వాత వారి నుంచి తప్పించుకుని గోడదూకి లోనికి ప్రవేశించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి రేవంత్‌ను అరెస్ట్ చేశారు. విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.