దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనకు ప్రత్యామ్నాయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌ను దేశ ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొని మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో అతి తక్కువ కాలంలోనే ప్రతి ఎకరాకూ నీరందించేలా సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు.
నాలుగున్నర కోట్ల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.అనేక రాష్ట్రాల్లో తాగునీటి కోసం మహిళలు కిలోమీటర్ల కొద్ది నడిచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. నదుల్లో సమృద్ధిగా నీళ్లున్నప్పటికీ సాగు నీటిని అందించడంలో కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్న ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర రాజకీయాలవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తున్నారని ఆయన తెలిపారు.