దేశంలో ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైనదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో అన్నారు.విభజన రాజకీయాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వీటికి అడ్డుకట్ట వేయకపోతే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠ మరింత దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సమర్థ ప్రతిపక్షంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం అనివార్యమని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు.
శనివారం మమత సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఫోన్‌లోనూ మాట్లాడారు. దేశాన్నిపీడిస్తున్న విభజన శక్తులను ప్రతిఘటించాలని మమత పిలుపునిచ్చారు. ఇష్టం లేని ప్రతిపక్ష పార్టీల నేతలను బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకొన్నదని తెలిపారు. దేశంలోని అన్ని ప్రగతిశీల ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సిన వాతావరణాన్ని రాష్ట్రపతి ఎన్నిక సృష్టించిందని వెల్లడించారు.రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా దేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని పేర్కొన్నారు.
దేశంలో అణగారిన వర్గాలు, ప్రాతినిథ్యం లేని వర్గాలకు ప్రజాస్వామ్యం గొంతుకగా నిలబడాలన్నారు. ఈ పర్యవసానాలపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో సమావేశమవుదామని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్‌తో పాటు ఢిల్లీ, కేరళ, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, ఆరెల్డీ, జేడీఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీల నేతలకు మమత లేఖలు రాశారు.