ఐపీఎల్ మీడియా, డిజిటల్ ప్రసార హక్కుల బిడ్డింగ్ నుంచి అమెజాన్ వైదొలిగింది. భారత్‌లో తమ వృద్ధికి ఇది సరైన ఎంపికగా కనిపించడం లేదని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ రేసులో స్టార్ స్పోర్ట్స్, సోనీ, జీ, రిలయన్స్ ముందున్నాయి. ఆదివారం ఆన్‌లైన్ ద్వారా జరిగే బిడ్డింగ్‌లో ఈ కంపెనీలు ప్రసార హక్కుల కోసం పోటీపడనున్నాయి.
ఈసారి గంపగుత్తగా ఒక్కరికే కాకుండా మీడియా రైట్స్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు.భారత ఉపఖండంలో టీవీ ప్రసార హక్కులు, డిజిటల్ హక్కులు, స్పెషల్ ప్యాకేజి (ఆరంభ, వీకెండ్ ఈవెనింగ్, ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు) డిజిటల్ హక్కులు, అంతర్జాతీయ ప్రసార హక్కుల కోసం ఈసారి ఆసక్తికల కంపెనీలు పోటీపడాల్సి ఉంటుంది.
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన లీగ్‌గా ఐపీఎల్ కొనసాగుతోంది. స్టార్ గ్రూప్ రూ.16,347 కోట్లతో కుదుర్చుకున్న ఐదేళ్ల ఒప్పందం తాజా సీజన్‌తో ముగిసింది. ఇక 2023-2027 వరకు జరిగే ప్రసార హక్కుల ఒప్పందంపై బీసీసీఐ ఏకంగా రూ.60వేల కోట్లను ఆశిస్తోంది. బిడ్డింగ్ కనీస ధరనే రూ.32,890 కోట్లుగా నిర్ణయించింది.