తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్‌ఏజీవై)లో సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్‌లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవే 15 ఉండటం గమనార్హం. రాష్ర్టానికి చెందిన పార్లమెంట్ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్థానికంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నది. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల వల్లనే మ్రన గ్రామాలు దేశంలో టాప్‌లో నిలుస్తున్నాయి.
ఎస్‌ఏజీవై పథకంలో పేర్కొన్న కార్యక్రమాలు సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ షెడ్లు, ట్రాక్టర్, విద్యుత్తు సమస్యల పరిష్కారం, నర్సరీ, మొక్కల పెంప కం, ఇంకుడు గుంతలు, పారిశుద్ధ్యం వంటివి పల్లెప్రగతి ద్వారా అమలవుతున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ మెరుగ్గా ఉందని చెప్పుకొనే కేరళకు చెందిన గ్రామాలు తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేవు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని పల్లెలు ఎక్కడా తెలంగాణకు సమీపంలో కూడా లేవు. దీంతో మొదటి పది ర్యాంకులు మనవే ఉన్నాయి. తెలంగాణ గ్రామ పంచాయతీలు ఇతర విషయాల్లోనూ ముందునిలిచాయి. ఈ – పంచాయతీ, ఈ -ఆడిట్, బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్ ప్లస్) గ్రామాలు, రూర్బన్ క్లస్టర్లు వంటి అనేక అంశాల్లో తెలంగాణ ముందుంది. పంచాయతీలకు ప్రతి నెలా నిధులు విడుదల చేయడం, ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దుతున్నారు.