టెన్త్ విద్యార్థులకు లేనిపోనివి చెప్పి వాళ్ల ఆత్మహత్యలకు టీడీపీ నేత నారా లోకేష్ ప్రేరేపిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అలాంటి పనులు చేయొద్దని చెప్పేందుకే లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. అమరావతిలో మీడియాతో కొడాలి నాని మాట్లాడారు.
తాను డైరెక్ట్‌గా తన జూమ్ ఐడీతో వెళితే లోకేష్ మాట్లాడరని.. అందుకే తన మేనల్లుడి లింక్‌తో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పారు. టెన్త్ రిజల్ట్స్ విషయంలో లోకేశ్ ఏం మాట్లాడినా తాము ఊరుకోవాలా? అని నాని ప్రశ్నించారు. ప్రభుత్వం వల్ల విద్యార్థులెవరికీ నష్టం జరగదని.. ఫెయిలైన విద్యార్థులు ఈ అకడమిక్ ఇయర్ నష్టపోకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ డిమాండ్ చేస్తున్నారని.. ఒకటి నుంచి టెన్త్ వరకు అందరినీ పాస్ చేయాలని ఆయన అడగాల్సిందని ఎద్దేవా చేశారు. గ్రేస్ మార్కులు వేస్తే వాళ్లు కూడా లోకేశ్, పవన్ కల్యాణ్‌లాగే తయారవుతారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీలో పాస్ అయితే డైరెక్ట్‌గా పాస్ అయినట్లే ప్రభుత్వం పరిగణిస్తుందని చెప్పారు.