తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవల్ప్మెంట్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ రెండు శాఖల్లోని 1433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉండగా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయగా, మిగిలిన 80,039 ఉద్యోగాల భర్తీ చేస్తామని శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్ వన్ పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్ పోర్ట్, ఫారెస్ట్, ఎక్సైజ్, బ్రెవరేజెస్ కార్పోరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 12, 775 ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలన, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇందులో తొలి విడతగా 1326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేష్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే గ్రూప్ వన్, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం తెలిసిందే. తాజాగా ఇవాళ మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవల్మెంట్ డిపార్ట్ మెంట్ లోని మరో 1433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు 35220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకా మిగిలిన ఆయా శాఖాల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది.