‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్ భగీరథ’ విజయాన్ని తన ఖాతాలో వేసుకొనేందుకు కుట్ర చేసింది. ‘తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షలకుపైగా కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చాం.
రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కల్పించాం’ అని కేంద్ర జల్‌శక్తి శాఖ శనివారం ట్వీట్ చేసింది.ఈ ట్వీట్‌పై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ‘మేం పనులు చేస్తే.. మీరు ప్రచారం చేసుకొంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు, మేధావులు కూడా కేంద్రంపై మండిపడుతున్నారు. తాగునీటి కోసం తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను ఉద్యమ సమయంలోనే చూసి కేసీఆర్ చలించిపోయారని, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి న వెంటనే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారని గుర్తు చేస్తున్నారు.
మిషన్ భగీరథను రాష్ట్ర ప్రభుత్వం 46వేల కోట్లతో పూర్తి చేసింది. దీనికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. కేంద్ర మంత్రులు, అధికారులు వచ్చి ప్రశంసలు కురిపించారు తప్ప పైసాఇవ్వలేదు. నీతి ఆయోగ్ బృందం వచ్చి, ప్రశంసించి, 19వేల కోట్లు ఇవ్వాలని సూచించినా, కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నది వాస్తవం కాదా? అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.