ఒడిషాలో రాష్ట్ర మంత్రులకు సీఎం నవీన్ పట్నాయక్ షాక్ ఇచ్చారు. 20 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. సీఎం ఆదేశాలతోనే వారంతా రాజీనామాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రుల తీరుతో బీజేడీ (బిజూ జనతాదళ్) ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందనే ఆరోపణలతో మొత్తం మంత్రివర్గమే రాజీనామా చేయాలని నవీన్ ఆదేశించినట్లు సమాచారం.
ఇటీవలే బీజేడీ ప్రభుత్వం మూడేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకుంది. ఐదోసారి సీఎంగా ఉన్న నవీన్.. వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను అరికట్టేందుకు మంత్రివర్గం రాజీనామాను కోరినట్లు తెలుస్తోంది. త్వరలో కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి అందులో యువతకు ప్రాధాన్యమిస్తారని ప్రచారం జరుగుతోంది.