వ్యవసాయం దండుగ కాదు.. పండగ అని నిరూపించామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత, వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది. సాగునీరు లేదు. బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు. పెట్టుబడి లేదు. అప్పులతో, కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి. ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన నాకు ఆనాడు రైతాంగం దుస్థితిని చూసి మనసు వికలమైంది. కృష్ణా, గోదావరి నదులు మన ప్రాంతంగుండా ప్రవహిస్తున్నా సాగునీటికి నోచని రైతుల దుస్థితి చూసి చలించిపోయాను. అందుకే, స్వరాష్ట్ర సాధన అనంతరం వ్యవసాయరంగంపైనా, రైతుల సంక్షేమంపైనా ప్రత్యేక దృష్టిని సారించాను.
సంక్షేమం, సంస్కరణలతో..సజల సుజల సస్యశ్యామల తెలంగాణ
రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, పథకాలూ అమలులోకి తేవటంతో నేడు మన రాష్ట్రం ‘సజల సుజల సస్యశ్యామల తెలంగాణ’ గా మారింది. రైతన్నల రుణభారం తగ్గించడానికి రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవటం, ప్రతీ 5వేల ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం, రైతువేదికల నిర్మాణం, పంటకల్లాల నిర్మాణం, రైతుబంధు సమితిల ఏర్పాటు, పంటకాలంలో పెట్టుబడి సాయం కోసం రైతుబంధు, విధివశాత్తూ అసువులు బాసిన రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు రైతుబీమా, ప్రాజెక్టులు నిర్మించి సమృద్ధిగా సాగునీరు అందించడం, నీటి తీరువా బకాయిల రద్దు చేయడం, ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా సాగునీటి సరఫరా చేయడంద్వారా నేడు వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించగలిగాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రూ.50వేల కోట్లు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో మరే రాష్ట్రంలోనూ రైతన్నలకు ఇంతటి సౌకర్యాలు లేనేలేవంటే అతిశయోక్తి కాదు. నేడు ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయి.
మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ
తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయరంగానికి శతాబ్దాలుగా ఆదరువుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురై, పూడిపోయి, గట్లు తెగిపోయి, శిథిలావస్థకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం మిషన్ కాకతీయ పేరుతో పెద్దఎత్తున ఈ చెరువులను పునరుద్ధరించుకున్నాం. 15 లక్షలకుపైగా ఎకరాల సాగుభూమిని స్థిరీకరించుకున్నాం. చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. ఈ చెరువులన్నింటికీ సాగునీటి ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసిన ఫలితంగా నేడు నిండు వేసవిలో కూడా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలమట్టం పెరిగింది. చెరువులు అభివృద్ధి చెందటంతో చేపల పెంపకం జోరందుకుని, మత్స్యకారులు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు’ అని వివరించారు.