బహుజన హితాయః అని నినదించిన బుద్ధుడు, సర్వ సమతను కాంక్షించిన అంబేద్కర్, ఆర్థిక స్వాతంత్య్రాన్ని స్వప్నించిన కార్ల్ మార్క్స్ , స్వతంత్ర భారతంలో సోషల్ ఇంజినీరింగ్ కోసం కృషి చేసిన ఎందరో మహనీయుల స్ఫూర్తికి మహా విఘాతం, ఆచరణకు అడ్డంకి రేవంత్ రెడ్డి అనే ఒక కుసంస్కారి!వ్యక్తి కేంద్రక, స్వార్థ రాజకీయాలు; అందుకోసం ఎంత నీచానికైనా తెగబడే రేవంత్ రెడ్డి వాచాలత ఇది మొదటిసారి కాదు. ఆయనకు పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ తమ దౌర్భాగ్యానికి వగచి, కృశించి, నశించవలసిందే. లేక, రాష్ట్ర కాంగ్రెస్‌లోని నాయకులు ఆయనపై తిరగబడి తమ పార్టీని గాడిలో పెట్టుకుంటారో చూడాలి మరి. టీఆర్‌ఎస్ నాయకులుగా కాంగ్రెస్ పతనాన్ని మేము స్వాగతించవచ్చుగానీ, అది ప్రజాక్షేత్రంలో జరగాలి. ప్రజల అభీష్టం మేరకు జరగాలి. ఒక దుర్మార్గుని కారణంగా సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక గొప్ప విలువ లుప్తం అవడం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కాబోదు. కాబట్టే మా ఈ స్పందన.ఎందరో బలిదానాలు చేసి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఏర్పడిన తొలి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దొడ్డి దారిన కూల్చాలని ప్రయత్నించి, కెమెరాలకు చిక్కి, చిప్పకూడు తిన్న వ్యక్తి రేవంత్ రెడ్డి.
అతడి నిర్వాకాన్ని ఈ వ్యాస రచయితలు ఇద్దరూ నాడు టీడీపీలో ఉండి కూడా పార్టీ వేదికలపై ఖండించడమే కాక, జైలు నుంచి విడుదలై ఏదో ఘనకార్యం చేసినట్టు ఊరేగింపుగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు చేరుకొని రేవంత్ మాట్లాడిన మాటలను ‘మిత్రుడికో ప్రేమలేఖ’ పేరున ఓ పత్రికలో వ్యాసం రాసి నిరసించిన విషయం విదితమే. ఆలుగడ్డలు అమ్మేవాళ్లను, కల్లు గీసే వాళ్లను, చెప్పులు కుట్టే వాళ్లను మంత్రులుగ చేసినం’ అని ఆరోజు కూసిన రేవంత్, నేడు దళితుల, బహుజనుల సాధికారత అంటూ మాట్లాడటం, ఆత్మగౌరవ సభలు జరపడం, దళితులతో సహపంక్తి భోజనం చేయడం హాస్యాస్పదం. వారికి అవమానం!తెలంగాణ ఖర్మ కొద్దీ రెండు ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంట్ సభ్యులే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన తెచ్చిన ఓటు హక్కును చట్టబద్ధం చేసిన పార్లమెంట్‌లో సభ్యులుగా ఉంటూ కూడా దివారాత్రాలు సామాజిక చీడ పురుగులుగా వ్యవహరించడం వైచిత్రి. ఒకరికేమో మతపిచ్చి, మరొకరికి కులపిచ్చి. దళితులను, బీసీలను, మహిళలను అవమానపరిచే మాటలు గతంలో ఎన్నోసార్లు మాట్లాడిన రేవంత్‌కు నిలువెల్లా అహంకారం. అందరూ తన నాయకత్వం కింద నడవాలని మొన్న ఆయన మాటల సారాంశం. దానికి కారణం ఆయన ఫ్యూడల్, బూర్జువా మనస్తత్వం.
కులాల బురదలో మునిగిన ఆంధ్రప్రదేశ్ సమాజం నేడు ఎట్లా తిరోగమన దిశలో పయనిస్తున్నదో ఎరుక కలిగితే, చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఎటు పోకూడదోఅర్థమవుతుంది. సమస్త వృత్తుల, సకల శక్తుల శ్రమ కారణంగా; వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి; ఐటీ ఆధారిత సేవలు, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా రంగాల నిర్వహణలో దక్షత గల పారిశ్రామికవేత్తలు; వారికి దన్నుగా నిలబడే ప్రభుత్వాల కారణంగా భారతదేశం బలీయమైన దేశంగా తయారవుతున్నది.
తొలి నుంచీ అన్ని పార్టీలలోనూ ఉన్న సకల కులాల నాయకులూ, కార్యకర్తలూ తమ తమ పార్టీల లక్ష్య ప్రకటనను, మేనిఫెస్టోలను, వాటికి అంతస్సూత్రంగా ఉండే పార్టీ ఫిలాసఫీని నమ్ముకుని రాజకీయాలు చేయడం వల్లనే నేడు భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతున్నది. బీజేపీ లాంటి మత విద్వేష పార్టీ భారతీయ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడానికి కంకణం కట్టుకుని ఉన్నా, ఈ దేశ ప్రజల చైతన్యం ముందు వారు విఫలం అవుతూనే ఉన్నరు. విద్వేషాల చీకట్లు ఎన్నటికీ విజయపు వెలుగులు పంచలేవు!
ఒక విధంగా చెప్పాలంటే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం స్పష్టాతిస్పష్టం. వారి మత రాజకీయాలు మనకందరికీ ఎరుకే. కానీ 1885లో పుట్టిన 137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ సామాజిక సంస్కృతి (సోషల్ ఫ్యాబ్రిక్)తో సంబంధం ఉన్నది. గాంధీ-నెహ్రూల వారసత్వం ఉన్నది. ఇందిర, రాజీవ్‌ల కృషి, త్యాగం ఉన్నది. కనుకనే.. ఆ మధ్య రాహుల్‌గాంధీ పుట్టుక గురించి అస్సాం ముఖ్యమంత్రి అవాకులు పేలితే కేసీఆర్ తీవ్రంగా స్పందించిన్రు. ఇందిర, రాజీవ్‌ల గురించి ప్రస్తావించిన్రు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ, నేడు తెలంగాణలో ఎట్లాంటి నీచుల చేతిలో తమ పార్టీ నడుస్తున్నదో ఆలోచించుకోవాలి. బహుశా ఏబీవీపీ, టీడీపీ భావజాలం ఇంకా రేవంత్‌ను వీడనట్టున్నది.ఇక, రేవంత్ తనను తానుగా, రెడ్లకు నాయకుడుగా నిలిచిపోవాలనుకోవడం కూడా పేరాశే. ప్రజాస్వామ్య ప్రియులైన, ప్రతిభావంతులైన, త్యాగమూర్తులైన ఎందరో
రెడ్లకు తెలంగాణ ఆలవాలం.
రావి నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డితోపాటు, కులం తోక తీసేసుకున్న భవనం వెంకట్రాం, పుచ్చలపల్లి సుందరయ్య మొదలుకొని మర్రి చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి లాంటి మహనీయుల వరకు తెలంగాణ మేలు కాంక్షించిన మేరునగధీరులు ఎందరో ఉన్నరు. రెడ్లు, ముఖ్యంగా రెడ్డి యువత గర్వపడాల్సింది ఇట్లాంటి నాయకుల వారసత్వం పట్ల. అంతేతప్ప రేవంత్ లాంటి పనికిమాలిన సరుకు గురించి కాదు!జ్యోతిబా ఫూలే, కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న, భాగ్యరెడ్డి వర్మ, సీహెచ్. రాజేశ్వర రావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు, ఆచార్య జయశంకర్.. వీరందరూ ఎవరు? తాత్విక, రాజకీయ, పోరాట నాయకత్వాలు అందించిన వారే కదా? వారి అడుగుజాడలలోనే కదా నేడు కేసీఆర్ నడుస్తున్నది. అట్లాంటి దార్శనికత గల్ల నాయకులు నేడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉన్నారా? సమస్త కులాల సమగ్ర స్ఫూర్తియే తెలంగాణ. అది కొరవడిన రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి చేయకపోతే, మహనీయుల ఆత్మ క్షోభిస్తుంది!
కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు- ఈ సౌందర్యాలు శ్రమకు మాత్రమే అర్హమా? రాజ్యాధికారంలో వాటా వద్దా? రేవంత్ లాంటి వాళ్లకు ఊడిగం చేయాలన్నా అందరూ? ‘రెడ్డి’ కులంలో పుట్టిన ఏ మహానీయుడైనా గతంలో ఇట్లా చెప్పి ఉన్నాడా? మొన్నటి అమెరికా ఆర్థిక మాంద్యం, నిన్నటి గ్రీస్ దేశపు సంక్షోభం, నేటి శ్రీలంక పతనం మనకు చుట్టుకోకపోవడానికి కారణం మన Inlusive Social Fabric (సమ్మిళిత సామాజిక సంస్కృతి) అని ఎన్నిసార్లు చెబితే మాత్రం రేవంత్ రెడ్డికి అర్థం అవుతుంది!మహోన్నతమైన రాజ్యాంగప్రదాత, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం శ్రమించి, కేంద్రమంత్రి వంటి పదవులు వదిలేసిన మహామనీషి బాబాసాహెబ్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పెడితే నేడు రణరంగం అయింది ఆంధ్రప్రదేశ్. కులాల కంపుతో కునారిల్లిపోతున్న ఆంధ్రా మోడల్‌ను తెలంగాణకు తెద్దామనుకుంటున్న రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండకపోతే దాని సంపూర్ణ పతనం ఖాయం.
కనీస గుణం, వ్యక్తిత్వం, చిటికెడు ఆత్మగౌరవం లేని నాయకులు ఇట్లనే ఆగమాగం అయితరు. దొంగలకు సద్దులు కడుతనే ఉంటరు. బ్రోకర్లుగా చరిత్రకు ఎక్కుతరు.ఇపుడు అంబేద్కర్ స్ఫూర్తితో సబ్బండ వర్ణాలు ఏకమైతున్నయి. ప్రజాస్వామ్యవాదులైన, అభివృద్ధి కాముకులైన అగ్రకులాల నాయకులతో కలిసి బహుజనులు దేశాన్ని నిర్మిస్తున్నరు. ఇది సహించలేకపోతున్నడు రేవంత్ రెడ్డి. ‘ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్’లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న- ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పదవులు’ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నడు అనేది స్పష్టం. వికార మనస్తత్వం గల ఇలాంటి నాయకుల మాయలకు పడిపోవద్దని యువతను కోరుతున్నం. మరో నాలుగైదు రోజులలో రాష్ర్టావతరణ దినోత్సవం జరుపుకోబోతున్నాం. కోటి ఆశలతో తెలంగాణ తెచ్చుకున్న మనం, వాటిలో ఎన్నో నెరవేర్చుకున్న మనం.. ఇపుడు తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తం చేయాలని సంకల్పం తీసుకుంటున్నాం. అందుకు జూన్ 2 ఒక కొత్త ప్రారంభం.
Tomorrow is a brand new day, that’s never been touched. ఆ ఉజ్వలమైన రేపటి హక్కుదారులుగా మనం అర్హత పొందాలంటే తుచ్ఛమైన కుల, మత విద్వేషాల నుంచి బయటపడుదాం. రేవంత్ రెడ్డి లాంటి అవాంఛనీయ మోడల్‌లను తిప్పికొడదాం. ఈ పని కాంగ్రెస్ చేయకున్నా మనం చేయాల్సిందే. ఎందుకంటే రాష్ట్రం మనది, దేశం మనది. ఈ దేశ మహా వారసత్వ సంపదను కాదనుకుంటే వారి ఖర్మ. మనం మాత్రం ఆగొద్దు, తగ్గొద్దు. జై తెలంగాణ. జై భారత్.
– ఎల్. రమణ, ఎమ్మెల్సీ
– శ్రీశైల్‌రెడ్డి పంజుగుల