తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆడబిడ్డల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ సిద్ధమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు తీవ్రమైన రక్తహీనత, పిల్లలు పోషకాహారలోపంతో ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో 15 నుంచి 49 ఏండ్లలోపు యువతులు, మహిళల్లో రక్తహీనత ఆందోళనకరంగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి బలమైన పౌష్ఠికాహారాన్ని అందించాలని సంకల్పించింది.ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్‌లో ఉండాల్సిన పోషకాలపై శాస్త్రీయ అధ్యయనం చేసింది. వెన్న, కర్జూర, ప్రొటీన్ బిస్కెట్స్, ఐరన్ క్యాప్సూల్స్‌తో కూడిన కిట్ల బాధ్యతను తెలంగాణ ఫుడ్స్‌కు అప్పగించింది. తొలిదశలో ఈ కిట్స్‌ను ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌లో ప్రారంభించి, తరువాత మిగతా జిల్లాలకు విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు.