దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలుగుప్రజలు గర్వించేలా సినీ, రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్రను నందమూరి తారక రామారావు సృష్టించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత గమనాన్ని ఈ సందర్భంగా మంత్రి అజయ్ మననం చేసుకున్నారు.అధికారం అన్నది అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి అన్న మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి, పాలనలోకి తెచ్చి ఆచరించి చూపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ శిష్యుడైన సీఎం కేసిఆర్ సైతం ఆయన బాటలో ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నారన్నారు.
ఎన్టీఆర్ జీవితం అప్పుడప్పుడూ స్మరించుకునే చరిత్ర కాదని ప్రతిరోజూ చదవాల్సిన స్ఫూర్తి పాఠమని, భావితరాలకు ఆదర్శమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇద్దరే మహానుభావులు చరిత్రలో నిలబడిపోయారని వారు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని మంత్రి అజయ్ స్పష్టం చేశారు.పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు, క్రమశిక్షణతో కూడిన జీవితం, చిత్తశుద్ధితో కూడిన నిర్ణయాలు, తెలుగు భాషపై అభిమానం ఎన్టీఆర్‌ను తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలిపాయన్నారు.పేదల పక్షపాతిగా అన్నగారిగా కోట్లాది తెలుగు జనహృదయాలలో ఆయనది చెరగని ముద్ర వేశారని నేడు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంతటి రాజకీయచైతన్యంతో ఉన్నారంటే ఎన్టీఆర్ పాలనా సంస్కరణలే ప్రధాన కారణమన్నారు. పౌరాణిక పాత్రలను ప్రజల జీవితాల్లోకి తీసుకొచ్చారని తెలుగు ప్రజలు ఆయన్ను నిరంతరం స్మరించుకుంటారని వివరించారు
నిండైన గొప్ప వ్యక్తిత్వం, నిలువెత్తు తెలుగుతనం ఎన్టీఆర్ కే సొంతమని ఎన్నో చారిత్రాత్మక, జానపద, సామాజిక చైతన్యం కలిగించిన సినిమాలలో నటించి ప్రజలకు సందేశాత్మక చిత్రాలను అందించిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడని తెలిపారు. నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగువారి పట్ల చూపిస్తున్న వివక్షపై ఎన్టీఆర్ చేసిన ఆత్మ గౌరవ పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు.తెలుగు వారి ఆత్మ గౌరవానికి, ప్రజాహిత పాలనకు నందమూరి తారక రామారావు ప్రతీకని మంత్రి అజయ్ అన్నారు. తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణమని వారి శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కి ఈ గౌరవందక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవమని అన్నారు.
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజా జీవితంలోకి వచ్చినా.. రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తిని, సమాఖ్య వ్యవస్థ అవసరాన్ని నొక్కిచెప్పి తనదైన ఒక సైద్ధాంతిక పునాదిని ఎన్టీఆర్ ప్రతిపాదించారన్నారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడైనా జాతీయ ప్రత్యామ్నాయం కోసం అహర్నిశలూ కృషి చేశారని కాషాయ వస్త్రాలను ధరించినా లౌకికవాదాన్ని బలంగా నమ్మారని తెలిపారు.ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారని ఆయనను రాజకీయంగా విభేదించే వారు కూడా.. తెలుగు జాతికి గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తిగా అభిమానిస్తారన్నారు. ఎన్టీఆర్ ఒక సునామీలాగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.తెలుగు ఆత్మగౌరవ నినాదంతో వచ్చినా, జాతీయవాదిగా నిలబడ్డారని సంక్షేమ పథకాలకు మారుపేరుగా నిలిచినా, ప్రైవేటు రంగ ప్రాధాన్యాన్ని గుర్తించారని భూస్వామ్య నేపథ్యం నుంచి వచ్చినా, పాలనావ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చారన్నారు.
క్రమశిక్షణే పరమావధిగా, లక్ష్యసాధనే ధ్యేయంగా, సాహసమే ఊపిరిగా నందమూరి తారకరామారావు వెండితెర జీవితం ఆసాంతం అసాధారణ విజయాలతో కొనసాగిందన్నారు. ప్రజలే దేవుళ్లు. సమాజమే దేవాలయం’ సిద్ధాంతంతో ప్రాంతీయ పార్టీని స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు.ప్రాంతీయ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆ తారక రాముడిదేనని రాజకీయాన్ని వృత్తిగా కాకుండా లక్ష్యసాధనకు మార్గంగా పరిగణించి రాజకీయ పదవులను తృణప్రాయంగా ఎన్టీఆర్ చూశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.