కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ అంశాలపై వారితో చర్చించారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని.. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని వ్యాఖ్యానించారు. దేశంలో వచ్చే మార్పును ఎవరూ ఆపలేరన్నారు. దేవెగౌడ, కుమారస్వామితో జాతీయ, కర్ణాటక రాజకీయాలపై చర్చించినట్లు చెప్పారు.