ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ విజయవాడ కోర్టుకు హాజరయ్యారు.
ఆయనతో పాటు మరో సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. 2020లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
అయితే నాడు ఉన్న కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వీటిని ఖాతరు చేయకుండా లోకేశ్, కొల్లు రవీంద్రలు అచ్చెన్నాయుడుని పరామర్శించేందుకు ఏసీబీ కోర్టుకు వచ్చారని వారిద్దరిపై కేసు నమోదు అయ్యింది. కేసు విచారణలో భాగంగా ఇవాళ లోకేశ్, రవీంద్రలు విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు.