టీఆర్‌ఎస్ పార్టీలో రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి రేపటిలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్‌ఎస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావుకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని సమాచారం.
మరోవైపు వచ్చే నెల 21 తర్వాత రాజ్యసభ ఎంపీలు డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం ముగియనుంది. వారిస్థానాల్లోనూ మరో ఇద్దరిని ఎంపిక చేసేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాలకు నామినేషన్ల గడువు ఈనెల 31 వరకు ఉంది.
డి.శ్రీనివాస్, లక్ష్మీకాంతరావు స్థానాల్లో పదవులను ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు జాతీయ రాజకీయాల దృష్ట్యా సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పరిశీలించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఈ విషయాలన్నింటిపై కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.