ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి లేదని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతాడన్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం మంగళగిరిలో ఓడిపోయిన సొంతపుత్రుడు.. రెండు చోట్లా పోటీ చేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడిని నమ్ముకుని వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. కోనసీమ జిల్లా మురమళ్లలో వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబుతో పాటు దుష్టచతుష్టయం ఓర్వలేకపోతున్నాయని జగన్ ఆరోపించారు. దేవుడే వాళ్లకి వైద్యం చేస్తాడని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేశామని చెప్పుకొనే ధైర్యం చంద్రబాబు లేదన్నారు. మా చంద్రబాబు మంచి చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడికి లేదని విమర్శించారు. జగన్ మూడేళ్ల పాలనతో చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి పరుగెత్తాడని ఎద్దేవా చేశారు.
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. ఆరోగ్యం బాగా లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా జగన్ వైద్యం చేయిస్తాడని.. కానీ ఈర్ష్య, కడుపుమంటకు దేవుడే వైద్యం చేస్తాడని జగన్ వ్యాఖ్యానించారు. మత్స్యకార భరోసా కింద అర్హత కలిగిన ఒక్కో కుటుంబానికి రూ.10వేల సాయం అందిస్తున్నామని.. 1,08,755 మంది మత్స్యకారులకు రూ.109 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం వివరించారు.