తెలంగాణలో రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలను తక్కువ ధరకే కిరాయికి ఇచ్చేందుకు వీలుగా ప్రతి గ్రామీణ మండలంలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్(సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా మండల సమాఖ్యలకు అప్పగించనున్నారు.
రాష్ట్రంలో 536 గ్రామీణ మండలాలు ఉండగా ఇప్పటికే 131 మండలాల్లో సీహెచ్‌సీలను ఏర్పాటుచేశారు. మిగిలిన 405 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున సీహెచ్‌సీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క మండలానికి గరిష్ఠంగా రూ.30 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటుచేస్తారు. పెట్టుబడి వ్యయంలో 25 శాతం సబ్సిడీగా ఇస్తారు. మిగిలిన మొత్తం స్త్రీనిధి లేదా ఇతర బ్యాంకుల ద్వారా మహిళా మండల సమాఖ్యలకు రుణంగా ఇప్పిస్తారు. మండలంలో ఎక్కువగా సాగు చేసే పంటలను గుర్తించి, అందుకు అవసరమైన వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేస్తారు.
ఆయా పరికరాలను ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేస్తున్న కిరాయి కంటే తక్కువ ధరకే రైతులకు ఇవ్వనున్నారు. దీంతో వ్యవసాయ పరికరాలను సొంతంగా కొనుగోలు చేయలేని చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుంది. సీహెచ్‌సీల ఏర్పాటుతో పోటీ వాతావరణం ఏర్పడి ప్రైవేట్ వ్యక్తులు కూడా కిరాయిలు తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో కొంతకాలంగా యంత్ర పరికరాల వాడకం పెరుగుతున్నది. దీంతో ఆయా యంత్రాల కిరాయిలు కూడా పెరిగాయి. సీహెచ్‌సీల ద్వారా ఇవి తక్కువ కిరాయికే అందుబాటులోకి రావడంతో ఆ మేరకు వ్యవసాయంపై పెట్టుబడి కూడా తగ్గనున్నది.