ఖమ్మం నగరంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో రెండో మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం దిగ్విజయంగా ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా పాలకవర్గ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అండదండలు, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఖమ్మం నగరాభివృద్ధి సాధ్యమైందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో ఖమ్మం అభివృద్ధి వివక్షకు గురైందని మంత్రి అజయ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ రాక ముందు నగరంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు అందరికీ కనిపిస్తున్నాయన్నారు.
నగర అభివృద్ధిలో కీలకమైన తాగునీరు, కరెంటు సరఫరా, విద్య, వైద్యం, రవాణా వ్యవస్థ ఇలా అనేక రంగాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. మేయర్ పూనుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా అధ్వర్యంలో నగరాభివృద్ధి సాధనలో ఖమ్మం దూసుకెళ్తున్నదని, సుస్థిర అభివృద్ధిని సాధించామని మంత్రి అజయ్ పేర్కొన్నారు. ఖమ్మం ప్రగతికి తన సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని మరింత ప్రగతి సాధనకు కార్పొరేటర్లు అందరూ కార్యోన్ముఖులు కావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.