తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొత్త టాకీసులో పాత సినిమాలా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించాయని, ఇప్పుడు ఆ రెండు పార్టీల నుంచి విముక్తి కలగాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ భవన్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, అబ్రహంతో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
జాతీయ పార్టీలు రాష్ట్రంపై దండయాత్ర చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో గుణాత్మక మార్పుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టడం ఆ పార్టీలకు రుచించడం లేదన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.