కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. పలువురి రోగులను, వారి సహాయకులను హరీశ్‌రావు ఆప్యాయంగా పలుకరించి.. వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఓ రోగి తల్లి చెప్పిన మాటలు విన్న హరీశ్‌రావు.. తన పక్కనే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అప్రమత్తం చేశాడు.
వైద్య సేవలపై ఆమె మాటలు విన్న మీరు.. ఇప్పటికైనా మా గురించి అసెంబ్లీలో మంచి మాటలు చెప్పాలని రాజాసింగ్‌కు మంత్రి సూచించాడు. దీంతో అక్కడున్న వారంతా గట్టిగా నవ్వారు.మందులు ఇక్కడ ఇస్తున్నారా..? బయట నుంచి తెచ్చుకుంటున్నారా..? అని రోగి తల్లిని హరీశ్‌రావు ప్రశ్నించాడు. ఇక్కడ్నే ఇస్తున్నారని ఆమె చెప్పేసరికి.. పక్కానా అని మరోమారు మంత్రి అడిగారు. అవును అని ఆమె సమాధానం ఇచ్చే సరికి.. రాజాసింగ్ జీ జర సునో అంటూ హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
ఆస్పత్రుల్లోనే మందులు ఇస్తున్నారు.. వైద్య సేవలు బాగా అందుతున్నాయని అసెంబ్లీలో చెప్పాలని రాజాసింగ్‌కు మంత్రి సూచించారు. ఆస్పత్రిలో కలిసిన వారందర్నీ అడిగితే కూడా వైద్య సేవలు బాగా అందుతున్నాయని చెప్పారు. మీరు కూడా విన్నారు కదా అని మంత్రి పేర్కొన్నారు. ఈయన మమ్మల్ని ఊరికే తిడుతుంటాడు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవల గురించి మీరైనా ఈయనకు చెప్పండని రాజాసింగ్‌ను ఉద్దేశించి హరీశ్‌రావు వ్యాఖ్యానించడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు.