ఏపీలో వ్యవసాయ మోటార్లు అన్నింటికీ విద్యుత్‌మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు.
రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏవో ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులను సీఎం అభినందించారు. ఈనెల 11న మత్స్యకార భరోసా, 16న రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. జూన్ 15లోపు రైతులకు పంటల బీమా పరిహారం అందించాలని ఆయన ఆదేశించారు.