అబద్ధాలు చెప్పి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. బీజేపీ నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రం జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మూడేళ్ల క్రితం పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చారని.. ఆ విషయం ఏమైందని కవిత నిలదీశారు. దీనిపై పార్లమెంట్‌లో ఎప్పుడు మాట్లాడారని ప్రశ్నించారు. ఈ మూడేళ్లో ఐదుసార్లు మాత్రమే అర్వింద్ పార్లమెంట్‌లో మాట్లాడారని.. ఏరోజు కూడా పసుపుబోర్డు, మద్దతు ధర గురించి ప్రస్తావించలేదని విమర్శించారు.
ఎన్నిరోజులు ఇలా అబద్ధాలు చెప్పి పొద్దు గడుపుతారని కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలపై ఏ ప్రయత్నాలు చేస్తారో అని మూడేళ్లు విడిచిపెట్టామని.. ఇకపై వదిలిపెట్టేదే లేదన్నారు. ఢిల్లీలో మోకాళ్ల యాత్ర చేస్తారో.. అక్కడి నాయకుల వద్ద మోకరిల్లుతారో.. ఏం చేసైనా పసుపుబోర్డు తీసుకురావాల్సిందేనని కవిత డిమాండ చేశారు. లేనిపక్షంలో ఏ గ్రామానికి వెళ్లినా అర్వింద్‌ను నిలదీస్తామని ఆమె హెచ్చరించారు.