వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. సీఎం కేసీర్ తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన వానకాలం పంటల సాగు సన్నద్ధత- అవగాహన సదస్సులో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారని తెలిపారు.
వ్యవసాయానికి నిర్మల్ ప్రాంతం పెట్టింది పేరు. ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలకు ఎంతో సారూప్యత ఉంది. పత్తి పంటకు ఈసారి మద్దతు ధరకు మించి రెట్టింపుగా రూ.12 వేల వరకు ధర పలికిందన్నారు. రైతులు ఈ సారి పత్తి, సోయాబీన్ సాగు మీద దృష్టి సారించాలన్నారు. పత్తి సాగులో రైతులు విడిగా దొరికే విత్తనాలు, హెచ్ టీ కాటన్ విత్తనాలను ఉపయోగించవద్దన్నారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి దానికి కచ్చితంగా రశీదు తీసుకోవాలి. భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఎక్కువగా ఎరువులు, రసాయనాలు వాడొద్దు.
వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులు, రసాయనాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగును రైతులు ఎంచుకోవాలన్నారు. తెలంగాణలో ఈ ఏడాది 2 నుండి 2.5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశంలో బైబ్యాక్ గ్యారంటీ ఉన్న ఏకైక పంట ఆయిల్ పామ్. అందుకే దీనిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రైతును రాజును చేశారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేపట్టిన జలవికాస కార్యక్రమాలతో పుష్కల సాగునీటి వసతి రైతులకు అందుబాటులోకి వచ్చింది. సాగు కష్టాలు తీరడంతో కొద్ది కాలంగా రైతులందరూ ఒకే రకమైన పంటలను సాగు చేస్తున్నారని, అలా కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు.