ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ర్టానిక్స్ యూనిట్‌లో మరో నూతన ప్లాంట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కలిసి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రేడియంట్ కంపెనీ నుంచి 50 లక్షల టీవీలు తయారవ్వడం గర్వంగా ఉందన్నారు.
దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ కంపెనీ ఇది అని పేర్కొన్నారు. రేడియంట్ కంపెనీలో 3,800ల మందికి పైగా పని చేస్తున్నారని తెలిపారు. యూనిట్ ప్రారంభంలో సంవత్సరానికి 4 లక్షల టీవీలు తయారు చేద్దామని అనుకున్నప్పటికీ.. నెలకు 4 లక్షల టీవీలు తయారు చేసే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఇది తెలంగాణకు గర్వకారణం అన్నారు. ఉద్యోగుల్లో 53 శాతం మహిళలు ఉండగా, 60 శాతం తెలంగాణ వారే ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.