తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో తార్నాకలోని టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలో నూతన నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
దీంతో పాటు ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలోని ఓ బిల్డింగ్‌లో తాత్కాలిక నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. దీనికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. మొత్తం 50 సీట్లకు అడ్మిషన్లు ఉంటాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 30 సీట్లు, మేనేజ్‌మెంట్ కోటా కింద 20 సీట్లు ఉన్నాయి.ఇక రూ. 80 లక్షల వ్యయంతో 20 పడకల ఐసీయూ, నాలుగు బెడ్లతో కిడ్నీ సెంటర్, రూ. 15 లక్షలతో డయాలసిస్, రూ. 1.2 కోట్లతో రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ వారి ఆక్సిజన్ ప్లాంట్, రూ. 1.5 కోట్లతో నిర్మించిన క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఆస్పత్రిలో కేవలం ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే వైద్య సేవలు అందించేవారు. నేటి నుంచి ఇతరులకు కూడా సాధారణ ఫీజులు తీసుకొని ఓపీ సేవలు అందించనున్నారు.