తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరగనున్న సంగతి తెల్సిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఇందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, ఇంటర్ బోర్డ్ సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ సన్నద్ధదతపై చర్చించారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు..